అన్నమయ్య లేదా తాళ్ళపాక అన్నమాచార్యులు (మే 9, 1408 - ఫిబ్రవరి 23, 1503) తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు (సాధారణ భాషలో గేయాలను కూర్చేవారు). అన్నమయ్యకు పదకవితా పితామహుడుఅని బిరుదు ఉన్నది. దక్షిణాపథంలో భజన సాంప్రదాయానికి, పదకవితాశైలికి ఆద్యుడు. గొప్ప వైష్ణవ భక్తుడు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ని, అహోబిలము లోని నరసింహ స్వామి ని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32వేలకు పైగా కీర్తనలు రచించాడు . అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, భావలాలిత్యం పెనవేసికొని ఉంటాయి.
కన్నడ వాగ్గేయకారుడు పురందరదాసు అన్నమయ్యను శ్రీనివాసుని అవతారంగా ప్రశంసించాడంటారు. (సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ఖడ్గమైన నందకం అంశతో అన్నమయ్య జన్మించాడని శ్రీవైష్ణవసంప్రదాయంలో నమ్మకం ఉన్నది. ప్రధాన మందిరంలో ఘంట అవతారమని కూడా అంటారు). త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు వంటి సంకీర్తనాచార్యులకు అన్నమయ్య మార్గదర్శకుడు.
చందమామ రావే జాబిల్లి రావే అంటే వేంకటేశుడు ముద్దలు తిన్నాడో తినలేదో కానీ, తెలుగు పిల్లలు మాత్రము గబుక్కున తింటారు. జోఅచ్యుతానంద జో జో ముకుందా అంటే ముకుందుడు నిద్ర పోతాడో లేదో కానీ తెలుగు పిల్లలు మాత్రము హాయిగా నిద్ర పోతారు. అన్నమయ్య పాటలు తెలుగు సంస్కృతికి ప్రతిరూపాలు. అవి తెలుగు సంస్కృతిలో ఒక భాగమై పోయినాయి; జనాల నోళ్ళలో నాటుకొని పోయినాయి. తుమ్మెద పాటలు, గొబ్బిళ్ళ పాటలు, శృంగార గీతాలు, ఆధ్యాత్మిక పదాలు - ఇలా మొత్తము ముప్పై రెండు వేల పాటలు వ్రాసాడు.
జీవితగాథ
అన్నమయ్య మనుమడు తాళ్ళపాక చిన్నన్న అన్నమాచార్య చరితము అన్న ద్విపద కావ్యములో అన్నమయ్య జీవిత విశేషాలను పొందుపరచాడు. ఈ గ్రంథం 1948లో లభ్యమై ముద్రింపబడింది. అన్నమయ్య జీవితం గురించి మనకు తెలిసిన వివరాలకు ఈ రచనే మౌలికాధారం. కాని బహువిధాలైన నమ్మకాలూ, అనుభవాలూ, ఘటనలూ, కథలూ ఈ వివరాలలో పెనవేసుకొని ఉన్నాయి.
వంశం
10వ శతాబ్దంలో వారాణసిలో తీవ్రమైన కరవు వచ్చినపుడు కొందరు పండితులు దక్షిణాదికి వలస వచ్చారని, వారిలో "నందవరం" గ్రామంలో స్థిరపడినవారు నందవరీకులయ్యారని అంటారు. అన్నమయ్య కూడా నందవరీకుడే. ద్విపద కావ్యం ప్రకారం అన్నమయ్య తాత నారాయణయ్య. చదువు అబ్బక, గురువులు పెట్టే హింసలు భరించలేక నారాయణయ్య చనిపోవాలని అనుకొన్నాడట. వూరిలో గ్రామ దేవత చింతలమ్మ గుడివద్ద విషసర్పం పుట్టలో చేయి పెట్టాడట. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై అతని వంశంలో మూడవతరంలో హరి అంశతో ఒకబాలుడు జన్మిస్తాడని చెప్పిందట.
బాల్యం
నారాయణయ్య కొడుకు నారాయణ సూరి. విద్యావంతుడు. అతని బార్య లక్కమాంబ. ఆమెది తాళ్ళపాక సమీప గ్రామం మాడుపూరు. అక్కడ ఉన్న విష్ణువు కోవెలలో అమె శ్రద్ధగా మాధవుని అర్చించేదట. వారికి చాలా కాలం సంతానం కలుగలేదు. అతడు, అతని భార్య సంతానార్ధులై తిరుమలను దర్శించారట. ఆ దంపతులు తిరుమల తిరుపతిని దర్శించుకొని, ధ్వజస్తంభం ఎదురుగా సాష్టాంగ ప్రమాణం ఆచరించినపుడు ఒక దివ్యమైన కాంతి లక్కమాంబ గర్భంలో ప్రవేశించిందని గాధ. కొండలయ్య తాను ధరించే "బిరుదు గజ్జియల ముప్పిడి కఠారాన్ని" వారికందజేశాడట. అలా పుట్టిన శిశువే అన్నమయ్య. సర్వధారి సంవత్సరం వైశాఖ శుద్ధ పూర్ణిమ నాడు (మే 9, 1408) కడప జిల్లా లోనిరాజంపేట మండలం తాళ్ళపాక గ్రామములో అన్నమయ్య జన్మించాడు. 8వ యేట అన్నమయ్యకు ఆయన గురువు ఘనవిష్ణు దీక్షనొసగినపుడు అన్నమాచార్య నామం స్థిరపడింది.
అన్నమయ్య ఇంటిలో తల్లి సంగీతం, తండ్రి పాండిత్యం ఛాయలలో పెరిగాడు. ఉపవీత సంస్కారం పొందిన తరువాత ఇంటి గురుకులంలోనే విద్యాభ్యాసం సాగింది. ఏక సంధాగ్రాహి అయినందున అనతికాలంలో ఉన్నత విద్యావంతుడయ్యాడు. తన పదహారవ యేట అన్నమయ్యకు శ్రీవేంకటేశ్వర దర్శనానుభూతి కలిగింది. అప్పటినుండి అన్నమయ్య అద్భుతమైన కీర్తనలను రచింపసాగాడు.
తిరుమల దర్శనం
ఒకనాడు(8వ ఏట)ఎవరికీ చెప్పకుండా అన్నమయ్య కాలినడకన తిరుపతి బయలుదేరాడు. తిరుమలకు వెళ్ళే కొండదారిలో ఆయనకు అలివేలు మంగమ్మ దర్శనమిచ్చి పరమాన్నాన్ని ప్రసాదించినదనీ, పాదరక్షలు లేకుండా కొండనెక్కమని బోధించినదనీ చెబుతారు. అప్పుడు పరవశించి అలమేలుమంగను కీర్తిస్తూ అన్నమయ్య శ్రీవేంకటేశ్వర శతకము రచించాడు. తిరుమల శిఖరాలు చేరుకొన్న అన్నమయ్య స్వామి పుష్కరిణిలో స్నానం చేసి, వరాహ స్వామి దేవాలయంలో ఆదివరాహ స్వామిని దర్శించుకొన్నాడు. పిదప వేంకటపతి కోవెల పెద్దగోపురము ప్రవేశించి "నీడ తిరుగని చింతచెట్టు"కు ప్రదక్షిణ నమస్కారాలు చేసి, గరుడ స్తంభానికి సాగిలి మ్రొక్కాడు. సంపెంగ మ్రాకులతో తీర్చిన ప్రాకారము చుట్టి "విరజానది"కి నమస్కరించాడు. భాష్యకారులైన రామానుజాచార్యులను స్తుతించి, యోగ నరసింహుని దర్శించి, జనార్దనుని (వరదరాజస్వామిని) సేవించి, "వంట యింటిలో వకుళా దేవి"కు నమస్కరించి, "యాగశాల"ను కీర్తించి, ఆనంద నిలయం విమానమును చూచి మ్రొక్కాడు. కళ్యాణమంటపమునకు ప్రణతులిడి, బంగారు గరుడ శేష వాహనములను దర్శించాడు. శ్రీభండారమును చూచి, బంగారు గాదెలను (హుండీని) సమర్పించి తన పంచె కొంగున ముడివేసుకొన్న కాసును అర్పించాడు. బంగారు వాకిలిచెంతకు చేరి, దివ్యపాదాలతో, కటివరద హస్తాలతో సకలాభరణ భూషితుడైన దివ్యమనంగళ శ్రీమూర్తిని దర్శించుకొన్నాడు. తీర్ధ ప్రసాదాలను స్వీకరించి, శఠకోపముతోఆశీర్వచనము పొంది, ఆ రాత్రి ఒక మండపములో విశ్రమించాడు. తరువాత అన్నమయ్య కొండపై కుమార ధార, ఆకాశ గంగ, పాప వినాశం వంటి తీర్ధాలను దర్శించి, కొండపైనే స్వామిని కీర్తిస్తూ ఉండిపోయాడు. అతని కీర్తనలు విని అర్చకులు అతనిని ఆదరించ సాగారు.
తిరుమలలో ఘనవిష్ణువు అనే ముని స్వామి అన్నమయ్యను చేరదీసి అతనికి భగవదాజ్ఞను తెలిపి శంఖ చక్రాదికములతో శ్రీవైష్ణవ సంప్రదాయానుసారముగా పంచ సంస్కారములను నిర్వహించాడు. గురువుల వద్ద వైష్ణవ తత్వాలను తెలుసుకొంటూ, ఆళ్వారుల దివ్య ప్రబంధాలను అధ్యయనం చేస్తూ, వేంకటేశ్వరుని కీర్తిస్తూ తిరుమలలోనే అన్నమయ్య జీవితం గడప సాగాడు.
సంసారం, సంకీర్తనం
అన్నమయ్య తిరుమలలో ఉన్నాడని విని అతని తల్లిదండ్రులు తిరుమలకు వెళ్ళి అతనిని ఇంటికి తిరిగి రమ్మని బ్రతిమాలారు. ముందు నిరాకరించినా గాని అన్నమయ్య గురువు ఆనతిపై తాళ్ళపాకకు తిరిగి వచ్చాడు. కాని నిరంతరం భగవధ్యానంలో ఉంటూ స్వామిని కీర్తిస్తూ ఉండేవాడు. అతనికి యుక్త వయస్సు రాగానే తిమ్మక్క, అక్కమ్మ అనే పడతులతో వివాహం చేశారు తల్లిదండ్రులు. వైవాహిక జీవితంలో పడిన అన్నమయ్య ఒకమారు తన ఇద్దరు భార్యలతో కూడి తిరుమలను దర్శించాడు. ఆ సమయంలోనే శ్రీవేంకటపతికి రోజుకొక సంకీర్తన వినిపించాలని సంకల్పించాడు.
అప్పటినుండి అన్నమయ్య పుంఖానుపుంఖాలుగా కీర్తనలు చెప్పాడు. అతని శిష్యులు వాటిని గానం చేస్తూ తాళపత్రాలకు ఎక్కించసాగారు. తరువాత అన్నమయ్య తన భార్యలతో కలసి తీర్ధయాత్రలకు బయలుదేరాడు. వారు ముందుగా తమ వూరిలో చెన్నకేశవుని అర్చించారు. మార్గంలో నెందలూరు సౌమ్యనాధుని, ఒంటిమిట్ట రఘురాముని, కడపవేంకటరమణుని, చాగలమర్రి చెన్నకేశవుని దర్శించుకొన్నారు. తరువాత నవనారసింహ క్షేత్రం అయిన అహోబిలం చేరుకొని శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకొని ఆనందించారు. ఆ క్షేత్రాన్ని, తీర్ధాన్ని, దైవాన్ని అన్నమయ్య తన కీర్తనలతో స్తుతించాడు. అహోబల మఠ స్థాపనాచార్యుడైన ఆదివణ్ శఠకోపయతులవద్ద అన్నమయ్య సకల వైష్ణవాగమాలను అధ్యయనం చేశాడు. అతని బోధనల ద్వారా పరబ్రహ్మస్వరూపమునర్చించే దివ్యయోగంలో కుల విచక్షణ వంటి అడ్డుగోడలను కూలగొట్టాలని అవగతం చేసుకొన్నాడు. ఇంకా అన్నమయ్య దక్షిణాదిన ఎన్నో వైష్ణవ క్షేత్రాలను దర్శించుకొన్నాడు. అతని కీర్తనలు అంతటా ప్రసిద్ధం కాజొచ్చాయి.
రాజాశ్రయం
విజయగర రాజ ప్రతినిధి, దండనాధుడు అయిన సాళ్వ నరసింగరాయలు (ఇతడు శ్రీకృష్ణదేవరాయలుకు తాత), టంగుటూరు కేంద్రంగా ఆ సీమ ("పొత్తపినాడు") పాలనా వ్యవహారాలు చూస్తుండేవాడు. అతనికి "మూరురాయర గండ" అనే బిరుదుండేది. అన్నమయ్య కీర్తనలు, అతని ఆశీర్వచన మహాత్మ్యం గురించి విన్న దండనాధుడు తాళ్ళపాకకు వెళ్ళి అన్నమయ్యను దర్శించి అతనితో సాన్నిహిత్యాన్ని పెంచుకొన్నాడు. తరువాత అతను పెనుగొండ ప్రభువయినాక అన్నమయ్యను తన ఆస్థానానికి ఆహ్వానించాడు. రాజ ప్రాపకం వలన అన్నమయ్య సంగీత ప్రభావం కన్నడదేశంలో హరిదాసకూటాలలో ప్రసిద్ధమయ్యింది. తరువాతి కాలంలో ఆ రాజు అన్నమయ్యను తనపై కూడా ఒక్కపదాన్ని వినిపించమని కోరాడట. హరిని కీర్తించే నోట నరుని కీర్తించనని అన్నమయ్య నిరాకరించినందున, కోపించి రాజు అతనిని చెరసాలలో సంకెళ్ళలో ఉంచాడట. అన్నమయ్య నరహరినికీర్తించగా ఆ సంకెళ్ళు తొలగిపోయాయట.
అంత్య కాలం
రాజాస్థానం తనకు తగినది కాదని తెలుసుకొని అన్నమయ్య తిరుమల చేరాడు. తన శేషజీవితాన్ని స్వామి సన్నిధిలో నిత్యారాధనలో, సంకీర్తనా దీక్షలో గడిపాడు. ఈ దశలో బహుశా ఆధ్యాత్మిక సంకీర్తనలు అధికంగా రచించాడు. వేంకటాచలానికి సమీపంలో ఉన్న "మరులుంకు" అనే అగ్రహారంలో నివసించేవాడు. ఈ సమయంలో రాజ్యంలో కల్లోలాలు చెలరేగాయి. అంతఃకలహాలలో రాజవంశాలు మారాయి. అన్నమయ్య జీవితంపట్ల విరక్తుడై నిత్యసంకీర్తనలతో పొద్దుపుచ్చేవాడు. అతని కీర్తనలలోని ఆశీర్వచన మహాత్మ్యం కధలు కధలుగా వినిన ప్రజలు అతని సంకీర్తనా సేవకు జనం తండోపతండాలుగా రాసాగారు.
ఈ సమయంలోనే పురందర దాసు తిరుమలకు వచ్చాడు. ఇద్దరూ వయోవృద్ధులు. భక్తశ్రేష్టులు. విష్ణుసేవాతత్పరులు. సంగీత కళానిధులు. ఒకరినొకరు ఆదరంతో మన్నించుకొన్నారు. "మీ సంకీర్తనలు పరమ మంత్రాలు. వీటిని వింటే చాలు పాపం పటాపంచలౌతుంది. మీరు సాక్షాత్తు వేంకటపతి అవతారమే" అని పురందరదాసు అన్నాడట. అప్పుడు అన్నమాచార్యుడు "సంధ్య వార్చుకోవడానికి సాక్షాత్తు విఠలునితోనే నీళ్ళు తెప్పించుకొన్న భాగ్యశాలివి. మీ పాటలు కర్ణాటక సంగీతానికే తొలి పాఠాలు. మిమ్ము చూస్తే పాండురంగని దర్శించుకొన్నట్లే" అన్నాడట.
95 సంవత్సరాలు పరిపూర్ణ జీవితం గడిపిన అన్నమయ్య దుందుభి నామ సంవత్సరం ఫల్గుణ బహుళ ద్వాదశి నాడు (ఫిబ్రవరి 23, 1503) పరమపదించాడు. రాగిరేకులమీద వ్రాసిన తిధుల కారణంగా అతని జన్మ, మరణ దినాలు తెలుస్తున్నాయి.
ఇతడు శ్రీమహావిష్ణువు యొక్క ఖడ్గం అయిన నందకాంశ సంభూతుడు అని భావన ఉంది. "పదకవితా పితామహుడు", "సంకీరత్నాచార్యుడు", పంచమాగమ సార్వభౌముడు", ద్రవిడాగమ సార్వభౌముడు" - ఇవి అన్నమయ్యకు సమకాలీనులు సాదరంగా ఇచ్చిన బిరుద నామాలు. అవసానకాలంలో తన కొడుకు పెద తిరుమలయ్యను పిలచి, ఇంక దినమునకు ఒక్క సంకీర్తనకు తక్కువ కాకుండా శ్రీనివాసునకు వినిపించే బాధ్యతను అతనికి అప్పగించాడట.
అన్నమయ్య కీర్తనలు, రచనలు
ముఖ్య వ్యాసము: అన్నమయ్య కీర్తనలు, రచనలు
అన్నమయ్య సంకీర్తనా సేవ సంగీత, సాహిత్య, భక్తి పరిపుష్టం. అధికంగా తెలుగులోనే పాడినా అతను సంస్కృత పదాలను ఉచితమైన విధంగా వాడాడు. కొన్ని వందల కీర్తనలను సంస్కృతంలోనే రచించాడు. కొన్నియెడల తమిళ, కన్నడ పదాలు కూడా చోటు చేసుకొన్నాయి. అతని తెలుగు వ్యావహారిక భాష. మార్గ, దేశి సంగీత విధానాలు రెండూ అతని రచనలలో ఉన్నాయి. అన్నమయ్యకు పూర్వం కృష్ణమాచార్యుల వచనాలవంటివి ఉన్నా గాని అవి "అంగాంగి విభాగం లేక, అఖండ గద్య ధారగా, గేయగంధులుగా" ఉన్నాయి. శివకవుల పదాలగురించి ప్రస్తావన ఉన్నాగాని అవి లభించడంలేదు. మనకు లభించేవాటిలో అన్నమయ్యవే తొలిసంకీర్తనలు గనుక అతను "సంకీర్తనాచార్యుడు", 'పదకవితా పితామహుడు" అయ్యాడు.
అన్నమయ్య "యోగ వైరాగ్య శృంగార సరణి" మొత్తం 32,000 సంకీర్తనలు రచించాడని అతని మనుమడు చిన్నన్న పేర్కొన్నాడు. అతని పుత్రపౌత్రాదులు వీటిని రాగిరేకులమీద వ్రాయించారు. ఆ రేకులను తిరుమలలో సంకీర్తనా భండాగారంలో పొందుపరచారు. అయితే ప్రస్తుతం 12,000 మాత్రమే లభిస్తున్నవి. రేకులమీది అంకెల ప్రకారం కొన్ని రేకులు లభించడంలేదు. (వాటిని కొందరు కరగించుకొని ఉండవచ్చును.)
సంకీర్తనా లక్షణమనే సంస్కృత గ్రంధం కూడా అన్నమయ్య వ్రాశాడట. మంజరీ ద్విపదలో "శృంగార మంజరి" అనే కావ్యాన్ని రచించాడు. అతడు రచించాడని చెప్పబడే 12 శతకాలలో "వేంకటేశ్వర శతకము" ఒక్కటి మాత్రమే లభిస్తున్నది. ఇతర ప్రబంధాలు, వేంకటాచల మహాత్మ్యము, సంకీర్తనలక్షణం, ద్విపద రామాయణం వంటి గ్రంధాలు లభించలేదు.
రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ మాటలలో అన్నమయ్య రచనలు " ఒక సారస్వత క్షీర సముద్రం. కావ్యముల ధర్మమైన బావార్జవంలో, శైలిలో, భావవైవిధ్యంలో, రాశిలో అన్నమాచార్యుని రచనను మించినది ఆంధ్ర వాఙ్మయంలో మరొక్కటి లేదు... నగుబాట్లైన ద్విపద, పద కవితలను ఉద్ధరించి ఉన్నత స్థానం కలిగించిన ప్రతిష్ఠ అన్నమాచార్యునిదే"
అలమేలుమంగ, శ్రీనివాసుల కీర్తనలకు తన జీవితాన్ని అంకితం చేసిన పరమభక్తుడు అన్నమయ్య. అతని రచనలలో భక్తి, సంగీతము, సాహిత్యము, శృంగారము, వేదాంతము అత్యంత మనోహరంగా, వినసొంపుగా చెప్పబడ్డాయి. సరళమైన మాటలలో ఆధ్యాత్మ సత్యాలను, వేంకటపతి తత్వాన్ని, జీవాత్మ పరమాత్మల తాదాత్మ్యాన్ని వినిపించాడు. లోకనీతిని, ధర్మాన్ని, విష్ణుతత్వాన్ని కీర్తించాడు. దక్షిణాపధంలో భజన సంప్రదాయానికి అన్నమయ్యే ఆద్యుడు.
ఉదాహరణలు
అదివో అల్లదివో శ్రీహరి వాసము
పదివేల శేషుల పడగల మయము॥
అదె వేంకటాచల మఖిలోన్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము
అదివో నిత్యనివాస మఖిల మునులకు
అదె చూడుడదె మ్రొక్కుడానందమయము॥
చెంగట నల్లదివో శేషాచలము
నింగి నున్నదేవతల నిజవాసము
ముంగిట నల్లదివో మూలనున్న ధనము
బంగారు శిఖరాల బహు బ్రహ్మ మయము॥
కైవల్య పదము వేంకటనగ మదివో
శ్రీ వేంకటపతికి సిరులైనవి
భావింప సకల సంపద రూప మదివో
పావనముల కెల్ల పావన మయము॥
పదివేల శేషుల పడగల మయము॥
అదె వేంకటాచల మఖిలోన్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము
అదివో నిత్యనివాస మఖిల మునులకు
అదె చూడుడదె మ్రొక్కుడానందమయము॥
చెంగట నల్లదివో శేషాచలము
నింగి నున్నదేవతల నిజవాసము
ముంగిట నల్లదివో మూలనున్న ధనము
బంగారు శిఖరాల బహు బ్రహ్మ మయము॥
కైవల్య పదము వేంకటనగ మదివో
శ్రీ వేంకటపతికి సిరులైనవి
భావింప సకల సంపద రూప మదివో
పావనముల కెల్ల పావన మయము॥
అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసె నీవుయ్యాల |
పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు దెలిపె నీ వుయ్యాల ||
ఉదాయాస్త శైలంబు లొనర కంభములైన వుడుమండలము మోచె నుయ్యాల |
అదన ఆకాశపదము అడ్డౌదూలంబైన అఖిలంబు నిండె నీ వుయ్యాల ||
పదిలముగ వేదములు బంగారు చేరులై పట్టి వెరపై తోచె వుయ్యాల |
వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింప నరుదాయె వుయ్యాల ||
మేలు కట్లయి మీకు మేఘమణ్డలమెల్ల మెరుగునకు మెరుగాయె వుయ్యాల |
నీల శైలమువంటి నీ మేనికాంతికి నిజమైన తొడవాయె వుయ్యాల ||
పాలిండ్లు కదలగా పయ్యదలు రాపాడ భామినులు వడినూచు వుయ్యాల |
వోలి బ్రహ్మాణ్డములు వొరగువో యని భీతి నొయ్య నొయ్యనైరి వూచిరుయ్యాల ||
కమలకును భూపతికి కదలు కదలకు మిమ్ము కౌగలింపగజేసె నుయ్యాల |
అమరాంగనలకు నీ హాస భావ విలాస మందంద చూపె నీ వుయ్యాల ||
కమలాసనాదులకు కన్నుల పండుగై గణుతింప నరుదాయె వుయ్యాల |
కమనీయ మూర్తి వేంకటశైలపతి నీకు కడువేడుకై వుండె వుయ్యాల ||
కులుకక నడవరో కొమ్మలాలా (రాగం - దేసాళం)
కులుకక నడవరో కొమ్మలాలా
జలజల రాలీని జాజులు మాయమ్మకు
ఒయ్యనే మేను గదలీ నొప్పుగా నడవరో
గయ్యాళి శ్రీపాదతాకు కాంతులాలా
పయ్యెద చెఱగు జారీ భారపు గుబ్బల మీద
అయ్యో చెమరించె మా యమ్మకు నెన్నుదురు
చల్లెడి గందవొడి మై జారీ నిలువరో
పల్లకి వట్టిన ముద్దు బణతులాల
మొల్లమైన కుందనపు ముత్యాల కుచ్చులదర
గల్లనుచు గంకణాలు గదలీమాయమ్మకు
జమళి ముత్యాల తోడి చమ్మాళిగ లిడరో
రమణికి మణుల నారతు లెత్తరో
అమరించి కౌగిట నలమేలు మంగనిదె
సమకూడె వేంకటేశ్వరుడు మా యమ్మకు
కులుకక నడవరో కొమ్మలాలా
జలజల రాలీని జాజులు మాయమ్మకు
ఒయ్యనే మేను గదలీ నొప్పుగా నడవరో
గయ్యాళి శ్రీపాదతాకు కాంతులాలా
పయ్యెద చెఱగు జారీ భారపు గుబ్బల మీద
అయ్యో చెమరించె మా యమ్మకు నెన్నుదురు
చల్లెడి గందవొడి మై జారీ నిలువరో
పల్లకి వట్టిన ముద్దు బణతులాల
మొల్లమైన కుందనపు ముత్యాల కుచ్చులదర
గల్లనుచు గంకణాలు గదలీమాయమ్మకు
జమళి ముత్యాల తోడి చమ్మాళిగ లిడరో
రమణికి మణుల నారతు లెత్తరో
అమరించి కౌగిట నలమేలు మంగనిదె
సమకూడె వేంకటేశ్వరుడు మా యమ్మకు
క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని
నీరజాలయమునకు నీరాజనం
జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు
నెలకొన్న కప్పురపు నీరాజనం
అలివేణి తురుమునకు హస్తకమలంబులకు
నిలువుమాణిక్యముల నీరాజనం
చరణ కిసలయములకు సకియ రంభోరులకు
నిరతమగు ముత్తేల నీరాజనం
అరిది జఘనంబునకు అతివ నిజనాభికిని
నిరతి నానావర్ణ నీరాజనం
పగటు శ్రీవేంకటేశు పట్టపురాణియై
నెగడు సతికళలకును నీరాజనం
జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల
నిగుడు నిజ శోభనపు నీరాజనం
నీరజాలయమునకు నీరాజనం
జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు
నెలకొన్న కప్పురపు నీరాజనం
అలివేణి తురుమునకు హస్తకమలంబులకు
నిలువుమాణిక్యముల నీరాజనం
చరణ కిసలయములకు సకియ రంభోరులకు
నిరతమగు ముత్తేల నీరాజనం
అరిది జఘనంబునకు అతివ నిజనాభికిని
నిరతి నానావర్ణ నీరాజనం
పగటు శ్రీవేంకటేశు పట్టపురాణియై
నెగడు సతికళలకును నీరాజనం
జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల
నిగుడు నిజ శోభనపు నీరాజనం
జోఅచ్యుతానంద జోజో ముకుంద
రావె పరమానంద రామ గోవింద
నందు నింటను జేరి నయము మీఱంగ
చంద్రవదనలు నీకు సేవ చేయంగ
నందముగ వారిండ్ల నాడుచుండంగ
మందలకు దొంగ మా ముద్దురంగ
పాలవారాశిలో పవళించినావు
బాలుగా మునుల కభయమిచ్చినావు
మేలుగా వసుదేవు కుదయించినావు
బాలుడై యుండి గోపాలుడైనావు
అట్టుగట్టిన మీగ డట్టె తిన్నాడే
పట్టి కోడలు మూతిపై రాసినాడే
అట్టె తినెనని యత్త యడగ విన్నాడే
గట్టిగా నిది దొంగ కొట్టుమన్నాడే
గొల్లవారిండ్లకు గొబ్బునకుబోయి
కొల్లలుగా త్రావి కుండలను నేయి
చెల్లునా మగనాండ్ర జెలిగి యీ శాయీ
చిల్లతనములు సేయ జెల్లునటవోయి
రేపల్లె సతులెల్ల గోపంబుతోను
గోపమ్మ మీ కొడుకు మా యిండ్ల లోను
మాపుగానే వచ్చి మా మానములను
నీపాపడే చెఱిచె నేమందుమమ్మ
ఒకని యాలినిదెచ్చి నొకని కడబెట్టి
జగడములు కలిపించి సతిపతులబట్టి
పగలు నలుజాములును బాలుడై నట్టి
మగనాండ్ర చేపట్టి మదనుడై నట్టి
అంగజుని గన్న మా యన్న యిటు రారా
బంగారు గిన్నెలో పాలు పోసేరా
దొంగ నీవని సతులు గొంకుచున్నారా
ముంగిట నాడరా మోహనాకార
గోవర్ధనంబెల్ల గొడుగుగా పట్టి
కావరమ్మున నున్న కంసుపడగొట్టి
నీవు మధురాపురము నేలచేపట్టి
ఠీవితో నేలిన దేవకీపట్టి
అలిగి తృణావర్తు నవని గూల్చితివి
బలిమిమై బూతన బట్టి పీల్చితివి
చెలగి శకటాసురుని జేరి డొల్చితివి
తలచి మద్దులు రెండు ధరణి వ్రాల్చితివి
హంగుగా తాళ్ళపా కన్నయ్య చాల
శృంగార రచనగా చెప్పెనీ జోల
సంగతిగ సకల సంపదల నీవేళ
మంగళము తిరుపట్ల మదనగోపాల
రావె పరమానంద రామ గోవింద
నందు నింటను జేరి నయము మీఱంగ
చంద్రవదనలు నీకు సేవ చేయంగ
నందముగ వారిండ్ల నాడుచుండంగ
మందలకు దొంగ మా ముద్దురంగ
పాలవారాశిలో పవళించినావు
బాలుగా మునుల కభయమిచ్చినావు
మేలుగా వసుదేవు కుదయించినావు
బాలుడై యుండి గోపాలుడైనావు
అట్టుగట్టిన మీగ డట్టె తిన్నాడే
పట్టి కోడలు మూతిపై రాసినాడే
అట్టె తినెనని యత్త యడగ విన్నాడే
గట్టిగా నిది దొంగ కొట్టుమన్నాడే
గొల్లవారిండ్లకు గొబ్బునకుబోయి
కొల్లలుగా త్రావి కుండలను నేయి
చెల్లునా మగనాండ్ర జెలిగి యీ శాయీ
చిల్లతనములు సేయ జెల్లునటవోయి
రేపల్లె సతులెల్ల గోపంబుతోను
గోపమ్మ మీ కొడుకు మా యిండ్ల లోను
మాపుగానే వచ్చి మా మానములను
నీపాపడే చెఱిచె నేమందుమమ్మ
ఒకని యాలినిదెచ్చి నొకని కడబెట్టి
జగడములు కలిపించి సతిపతులబట్టి
పగలు నలుజాములును బాలుడై నట్టి
మగనాండ్ర చేపట్టి మదనుడై నట్టి
అంగజుని గన్న మా యన్న యిటు రారా
బంగారు గిన్నెలో పాలు పోసేరా
దొంగ నీవని సతులు గొంకుచున్నారా
ముంగిట నాడరా మోహనాకార
గోవర్ధనంబెల్ల గొడుగుగా పట్టి
కావరమ్మున నున్న కంసుపడగొట్టి
నీవు మధురాపురము నేలచేపట్టి
ఠీవితో నేలిన దేవకీపట్టి
అలిగి తృణావర్తు నవని గూల్చితివి
బలిమిమై బూతన బట్టి పీల్చితివి
చెలగి శకటాసురుని జేరి డొల్చితివి
తలచి మద్దులు రెండు ధరణి వ్రాల్చితివి
హంగుగా తాళ్ళపా కన్నయ్య చాల
శృంగార రచనగా చెప్పెనీ జోల
సంగతిగ సకల సంపదల నీవేళ
మంగళము తిరుపట్ల మదనగోపాల
కవి కుటుంబం
- ప్రధాన వ్యాసం: తాళ్ళపాక కవులు
అన్నమయ్య వంశం తెలుగు సాహిత్యానికి ఆభరణం. అన్నమయ్య తండ్రి మహాపండితుడు. తల్లి సంగీతకళానిధి. అన్నమయ్య భార్య తిమ్మక్క తెలుగులో తొలి కవయిత్రి. "సుభద్రా కళ్యాణం" మంజరి ద్విపద కావ్యం రచించింది. ఈమె కుమారుడు నరసింహుడు సంగీత సాహిత్య కళా కోవిదుడని చిన్నన్న వ్రాశాడు ("పాడఁజెప్పఁగ వర్ణపద్ధతినీడు, జోడులేఁడని సభ సొచ్చి వాదించి, పరఁగిన ధీశాలి ప్రతివాదదైత్య నరసింహుఁడనఁగల్గె నరసింహగురుఁడు"). కవికర్ణ రసాయనం అనే కావ్యాన్ని వ్రాసిన సంకుసాల నృసింహకవి ఇతడేనని కొందరి అభిప్రాయం. నరసింగన్న భార్యలు వాచ్చారమ్మ, అనంతమ్మ. వారి పుత్రులు నారాయణుడు, అప్పలార్య, అన్నలార్య.
తిరుమలాచార్యుడు తండ్రి వలెనే సంకీర్తనా యజ్ఞం నిర్వహించాడు. ఇతని ఆధ్యాత్మ శృంగార సంకీర్తనలతో పాటు మరికొన్ని లఘురచనలు లభించాయి. వెంకటేశ్వర వచనములు, శృంగార దండకము, చక్రవాళ మంజరి, శృంగార వృత్త శతకము, వేంకటేశ్వరోదాహరణము, నీతి సీసశతకము, సుదర్శన రగడ, రేఫఱకార నిర్ణయం, ఆంధ్ర వేదాంతం (భగవద్గీత తెలుగు అనువాదవచవం), శ్రీ వేంకటేశ ప్రభాత స్తవము (ద్విపద), సంకీర్తనా లక్షణ వ్యాఖ్యానం (అలభ్యం) వంటివి రచించాడు. ఇతని భార్య తిరుమలమ్మ. వారి కొడుకులు చిన తిరుమలయ్య, అన్నయ్య, పెదతిరువెంగళ నాధుడు, చినతిరువెంగళనాధుడు (చిన్నయ్య లేదా చిన్నన్న), కోనేటి తిరువేంగళనాధుడు. చినతిరుమలయ్య తన తండ్రి, తాతలవలెనే ఆధ్యాత్మ, శృంగార సంకీర్తనలు రచించాడు. ఇంకా అష్టభాషా దండకం, సంకీర్తన లక్షణం (తండ్రి, తాతల సంస్కృత రచనలకు అనువాదం) వ్రాశాడు.
చినతిరుమలయ్య, అతని భార్య పెదమంగమ్మల కొడుకు తిరువేంగళప్ప అమరుక కావ్యానువాదము, అమరకోశానికి బాల ప్రబోధిక వ్యాఖ్య, ముమ్మటుని కావ్య ప్రకాశికకు సుధానిధి వ్యాఖ్య, రామచంద్రోపాఖ్యానం (అలభ్యం) వంటి రచనలు చేశాడు. పెద తిరుమలయ్య కొడుకు చిన్నన్న జనుల మన్ననలు పొందిన పరమ భక్తుడు, మహాగాయకుడు, భజన సంప్రదాయ ప్రచారకుడు, ద్విపద కవితకు విశేషంగా ప్రచారాన్ని కలిగించాడు. ఇతడు రచించిన అన్నమాచార్యుని జీవిత చరిత్రయే మనకు అన్నమయ్య జీవితానికి సంబంధించిన ప్రధాన ఆధార గ్రంధము. అంతే గాక ఇతడు పరమయోగి విలాసము, అష్టమహిషీ కళ్యాణము, ఉషా పరిణయము అనే ద్విపద కావ్యాలను రచించాడు. అన్నమయ్య, అక్కలమ్మల కుమార్తె తిరుమలాంబను తిరుమల కొండయార్యునికిచ్చి పెండ్లి చేశారు. వారి కొడుకు రేవణూరి వెంకటాచార్యుడు శకుంతలా పరిణయము, శ్రీపాదరేణు మహాత్మ్యము.
ఇలా తాళ్ళపాక కవులు తెలుగు భాషకు, ప్రత్యేకించి పదకవితకు, ద్విపద కవితకు ఎనలేని సంపదను ఒనగూర్చారు. "చిన్నన్న ద్విపద కరగును, పన్నుగ పెద తిరుమలయ్య పదమునకెరగున్, మిన్నంది మొరసె నరసింగన్న పద్య గద్య శ్రేణిన్" అని తెనాలి రామకృష్ణుని చాటువు.
దొరికిన పెన్నిధి
ప్రాజెక్టులు, సంస్మరణా కార్యక్రమాలు
- వ్యాసం: అన్నమాచార్య ప్రాజెక్టు
అన్నమయ్య యొక్క విస్తృత పద సంపదను ఉపయోగించుకొని ప్రజలలో వేంకటేశ్వరుని మధురభక్తిని మరియు శరణాగతిని ప్రోత్సహించడానికి అన్నమాచార్య ప్రాజెక్టు స్థాపించబడినది. అన్నమాచార్య ప్రాజెక్టులో సంగీతం, పరిశోధన మరియు ప్రచురణ, రికార్డింగ్ అనే మూడు భాగాలున్నాయి. యువకళాకారులను తయారు చేసే దిశగా సంగీత విభాగం పని చేస్తుంది. పరిశోధన మరియు ప్రచురణ విభాగంలో భాగంగా అన్నమాచార్య సంకీర్తనల మీద, అన్నమాచార్యుల జీవిత చరిత్ర మీద పరిశోధన చేసేవారికి ప్రోత్సాహం లభిస్తుంది. రికార్డింగు విభాగం ద్వారా అన్నమయ్య సంకీర్తనలను ఆడియో క్యాసెట్ల రూపంలో తయారుచేసి మార్కెట్టులో అమ్ముతారు. తిరుమల తిరుపతి దేవస్థానము నిర్వహించే ధర్మ ప్రచార పరిషత్ తప్పితే మిగతా ప్రాజెక్టులన్నీ అన్నమాచార్య ప్రాజెక్టు పరిధిలోకి వస్తాయి. అన్నమాచార్య ప్రాజెక్టుతో దగ్గరి అనుబంధాన్ని కలిగి ఉంటాయి. అవి ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టు, భాగవత ప్రాజెక్టు, వేద రికార్డింగు ప్రాజెక్టు.
అన్నమయ్య ఆరు వందల జయంతి సందర్బంగా తాళ్ళపాక లో 19-5-2008 నుండి 22-05-2008 వరకు వుత్సవాలు జరుగుతున్నాయి.ఈ సందర్బంగా 108 ఆడుగుల విగ్రహాన్ని 108 రోజులలో నిర్మించారు. తి.తి.దే వారు నిర్వహిస్తున్నారు. అన్నమయ్య 12 వ తరము వారు అగర్బ దరిద్రములో కొట్టుమిట్టాడు తున్నారని(చూడుడు ఆంధ్రజ్యోతి తేది 23-05-08), ప్రభుత్వము వారు పించన్లు ఏర్పాటు చెయ్యడానికి వొప్పుకొన్నారు.అన్నమయ్య సాహితీ సంపదను తరతరాల వారికి అందించ డానికి , వారి వంశస్థులను వినియోగించ వచ్చును.