Tuesday, November 3, 2009

TIKKANA







తిక్కన (1205 - 1288) మహాభారతము లో నన్నయ్య రచించిన పర్వాలు కాకుండా మిగిలిన 15 పర్వాలను రచించాడు. ఆది కవినన్నయ ఆది పర్వముసభాపర్వముఅరణ్యపర్వములో కొంతభాగము రచించి గతించిరి. అరణ్యపర్వములో మిగిలిన భాగమునుఎఱ్ఱన రచించాడు.
తిక్కన అరణ్యపర్వమును వదలి, మిగిలిన పర్వములు రచించిరి. ముందుగా యజ్ఞము చేసి, సోమయాజియై, పిదప ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టాడు. ఈయనకు "కవి బ్రహ్మ", "ఉభయ కవిమిత్రుడు" అనే బిరుదులు ఉన్నాయి.
శివకేశవుల అభేదమును తెల్పు హరిహరనాధుని స్తుతితో తిక్కన భారతాన్ని ప్రారంభించాడు
శ్రీయన గౌరినాబరగు చెల్వకు చిత్తము పల్లవింప భ
ద్రాయితమూర్తియై హరిహరంబగు రూపము దాల్చి 'విష్ణు రూ
పాయ నమశ్శివాయ' యని పల్కెడు భక్తజనంబు వైదిక
ధ్యాయిత కిచ్చమెచ్చు పరతత్వము గొల్చెద నిష్టసిద్ధికిన్
తిక్కన మరికొన్ని పద్యములు:
ద్రౌపది కీచకునితో
దుర్వారోద్యమ బాహువిక్రమ రసాస్తోక ప్రతాపస్ఫురత్
గర్వాంధ ప్రతివీర నిర్మధన విద్యాపారగుల్ మత్పతుల్
గీర్వాణాకృతు లేవు రిప్డు నిను దోర్లీలన్ వెసంగిట్టి గం
ధర్వుల్ మానము బ్రాణమున్ గొనుట తధ్యంబెమ్మెయిన్ గీచకా
ఉత్తర గోగ్రహణ సమయమున ద్రోణుడు
సింగంబాకటితో గుహాంతరమునన్ జేర్పాటుమై యుండి మా
తంగ స్ఫూర్జిత యూధ దర్శన సముద్యత్క్రోధమై వచ్చు నో
జం గాంతార నివాస ఖిన్న మతి యస్మత్ సేనపై వీడె వ
చ్చెం గుంతీ సుత మధ్యముండు సమర స్థేమాభిరామాకృతిన్
తిక్కన ఉభయ కవిమిత్రుడు, కవిబ్రహ్మ. తన కాలం నాటి సంఘములోని మతవైషమ్యాలను గమనించి శైవ వైష్ణవ మత కలహాలకు అతీతంగా హరిహరాద్వైతాన్ని సృష్టింఛాడు. సంఘసంస్కర్తగా నిలిఛాడు. అలతి అలతి పదముల అనల్పార్థ రచన కావించిన మహాకవి తిక్కన. తాను రచించిన 15 పర్వాల భారతాన్ని ప్రబంధమండలిగా పేర్కొని, నాటకీయ శైలిలో , నానారసాభ్యుదయోల్లాసిగా రచించాడు. కవిత్రయములో నన్నయది కథాకథన శైలి. ఆఖ్యాయిక శైలి. తిక్కనది నాటకీయ శైలి, సంభాషణాత్మక శైలి


రాజకీయ, సామాజిక వేపధ్యం

తీరాంధ్రంలో తెలుగు సాహిత్యానికి తొలి పలుకులు పలికిన వేంగి రాజ్యం క్రీ.శ. 624లో ప్రారంభమై, 1075లో అంతరించింది. తెలంగాణ ప్రాంతం అంతవరకు బాదామి చాళుక్యులకు, రాష్ట్రకూటులకు యుద్ధభూమిగా కల్లోలితమై ఉంది. తెలంగాణంలో ఆరంభమైన కాకతీయ వంశము ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రాంతమును క్రీ. శ. 1083 నుండి క్రీ. శ. 1323 వరకు పరిపాలించిన రాజవంశము. కాకతీయులు ఆంధ్రదేశాన్ని అంతటిని ఒకే త్రాటిపైకి తెచ్చి పరిపాలించారు. శాతవాహనుల అనంతరం ఆంధ్రదేశాన్ని,జాతినీ సమైక్యం చేసి, ఏకచ్ఛత్రాధిత్యం క్రిందికి తెచ్చిన హైందవ రాజవంశీయులు కాకతీయులొక్క. వీరి రాజధాని ఓరుగల్లు (నేటి వరంగల్).

అంతకుముందు తీరాంధ్ర ప్రాంతాన్ని కొణిదెన చోళులు, నెల్లూరు చోడులు పాలించారు. కడప ప్రాంతాన్ని రేవాటి చోళులు, కోనసీమను హైహయ రాజులు, నిడదవోలును వేంగి చాళుక్య చోళులు, కొల్లేరు ప్రాంతాన్ని తెలుగు నాయకులు, విజయవాడను చాగివారు, ధరణికోటను కోటవారు, కొండవీడును కమ్మ నాయకులు, పల్నాటిని హైహయ వంశపు రాజులు పాలిస్తుండేవారు. ఈ చిన్న చిన్న రాజ్యాల మధ్య తగాదాలు వైషమ్యాలు సర్వ సాధారణం. క్రీ. శ. 1176-1182 మధ్యకాలంలో కారెంపూడి వద్ద జరిగిన పల్నాటి యుద్ధంలో జరిగిన అపారమైన జన, ఆస్తి నష్టం వల్ల తీరాంధ్ర రాజ్యాలన్నీ శక్తిహీనములయ్యాయి. సమాజం కకావికలయ్యింది. బలం కలిగిన పాలకులు లేకపోతే జరిగే కష్టం ప్రజలకు అవగతమయ్యింది. ఈ పరిస్థితిలో ఓరుగల్లు కాకతీయులకు రాజులందరినీ ఓడించడం అంత కష్టం కాలేదు. ఆంధ్ర దేశాన్ని తమ పాలనలో ఐక్యం చేసే అవకాశం వారికి లభించింది.

కాకతీయులు శైవమతస్థులే కాని వీరశైవాన్ని అనుసరించలేదు. అనగా కాకతీయులు వైష్ణవులను బాధించలేదు. (అయితే వారికాలంలో జైనులపై జరిగిన అత్యాచారాలను వారు నిరోధించలేకపోయారని తెలుస్తుంది). అయితే సమాజంలో శైవులకు, వైష్ణవులకు మధ్య విభేదాలు పెచ్చరిల్లి ఉన్నాయి. పలనాటి యుద్ధానికి ఇది కూడా ఒక కారణం. తిక్కనకు ముందు కాలంలో శివకవులు సృజించిన వీరశైవ సాహిత్యం సమాజాన్ని చాలా ప్రభావితం చేసింది. శైవేతరులు బహుశా ఆ సాహిత్యాన్ని ఏవగించుకొని ఉండవచ్చును కూడాను కాని అందుకు ప్రతిసాహిత్యాన్ని సృజించినట్లు లేదు. ఈ నేపధ్యంలో "భిన్న మతముల యొక్కయు, భిన్న దైవతముల యొక్కయు అవధులను దాటి తాత్వికమైన పరమార్ధమును గ్రహించి, దానిని కాలానుగుణమైన గ్రంధసృష్టి ద్వారా ప్రజలకు బోధింపగల మహాకవి ఆవిర్భావము ఆవశ్యకమైయుండును. మృ వైషమ్యములను అణచివేయు శక్తి ఒక్క అద్వైతమునకే యుండును. ఆ పరమ ధర్మమును శాస్త్రముల ద్వారా బోధిస్తే జనబాహుళ్యానికి రుచింపకపోవచ్చును. ఇలాంటి పరిస్థితిలో ధర్మాన్ని బోధింపగలిగిన మహాకవి తిక్కన ధర్మాద్వైతములను బోధించి జాతిని ఉద్ధరింపగలిగిన మహాపురుషుడయ్యాడు. తెలుగులో ఏ కవికి రాని చారిత్రిక ప్రాముఖ్యత తిక్కనకు లభించింది."


 యుగంలో భాష లక్షణాలు

శివకవుల కాలంలో ద్విపద రచనకు, దేశి కవితకు ప్రాముఖ్యత పెరిగింది. మతంతో సంబంధం లేకుండా సాహిత్యాన్ని సేవింపగలిగే పరిస్థితి కొరవడినందువలన శివకవులును, భవికవులును పరస్పరము గర్హించుకొనసాగారు. సంస్కృతాభిమానులకు, దేశి కవితాభిమానులకు వైషమ్యాలు పెరిగాయి. ఇలాంటి నేపధ్యంలోనే "ఉభయ కవిమిత్రుడు" అనే బిరుదు తిక్కన సాధించగలిగాడు.


ముఖ్య కవులు, రచనలు

ఈ యుగంలో మొట్టమొదట వెలువడిన గ్రంధం గోనబుద్ధారెడ్డి రచించిన రంగనాధ రామాయణము. ఈ కవి పాల్కురికి సోమనాధునికి ఇంచుమించు సమకాలికుడు. రంగనాధ రామాయణం చక్కని ద్విపద కావ్యం. గోనబుద్ధారెడ్డి అనంతరం యగకవి తిక్కన సోమయాజి నిర్వచనోత్తర రామాయణాన్ని రచించి, అ తరువాత మహాభారతం 15 పర్వాలను ఆంధ్రీకరించాడు. కొట్టరువు తిక్కన కార్యదక్షుడైన మంత్రి, ఖడ్గ నిపుణుడైన శూరుడు, కావ్య నిర్మాత అయిన కవి, ధర్మోపదేష్ట అయిన ఆచార్యుడు, తత్వజ్ఞాన సంపన్నుడైన ఆధ్యాత్మిక సాధకుడు. ఈ మహానుభావుడు ఆంధ్రజాతి పుణ్యవశమున అవతరించినాడని చెప్పవచ్చును అని పింగళి లక్ష్మీకాంతం వ్రాశాడు. తిక్కన 1205-1210 మధ్యకాలములో జన్మించి ఉండవచ్చును. 1288లో మరణించాడు.

తిక్కన సమకాలికుడైన కేతన తన దశకుమార చరిత్రను తిక్కనకే అంకితమిచ్చాడు. కేతన వ్రాసిన ఆంధ్రభాషా భూషణం తెలుగులో మొట్టమొదటి లక్షణ గ్రంధం. గోనబుద్ధారెడ్డి కుమారులైన కాచవిభుడు, విట్ఠలుడు అనే సోదరులు తమ తండ్రి రచనయైన రంగనాధరామాయణమునకు ఉత్తరకాండమును రచించి ఆ గ్రంధాన్ని పూర్తి చేశారు. మంచన అనే కవి కేయూరబాహుచరిత్రను రచించాడు. యథావాక్కుల అన్నమయ్య సర్వేశ్వర శతకం రచించాడు. తిక్కన శిష్యుడైన మారన మార్కండేయ పురాణాన్ని వ్రాశాడు. బద్దెన నీతిసార ముక్తావళి వ్రాశాడు. ఈ బద్దెనయే సుమతీ శతకం కూడా వ్రాసాడని అభిప్రాయం ఉంది కాని అది నిరూపితం కాలేదు. శివదేవయ్య, అప్పన మంత్రి, అధర్వణుడు ఈ కాలపు కవులే కావచ్చును.




No comments:

Post a Comment